Tuesday, September 24, 2024

19 ) Dana veera sura karna dialogues lyrics,

 


"దానవీరశూర కర్ణ"

1. “అస్త్ర విద్యా పరీక్ష”:-

దుర్యో:- ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము? ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయన దే కులము ?

నాతో చెప్పింతువేమయ్యా , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?

భీష్మ:- నాయనా సుయోధనా! ఏరుల, పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే! క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే! వారిలో రాజ్యమున్న వారే రాజులు! అట్టి యీ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!


దుర్యో:- ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు, అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

సోదరా.. దుశ్శాసనా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; పరిచారకులారా ! పుణ్య భాగీరథీనదీ తోయములనందుకొనుడు; కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు; పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ద సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి వాంఛలురేగ వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజనసమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను . 






2. "రాజసూయాహ్వానం దృశ్యం" :-


దుర్యో:-ఊ....ఊ...హ్హహ్హహ్హహ్హహ్హ...విరాగియైన పాండురాజుకూ, సరాగినియై కూళప్రవర్తనాసక్తయైన కుంతికీ జనించిన పాండవులు; ఆబాల్యమూ ఆటపాటలలో మమ్ముల నస బెట్టిన పాండవులు; లాక్షాగృహమున నిశీధిని నిట్టనిలువునా దహించినారన్న నీలాపనిందలు మామీద వేసిన పాండవులు; ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లూ తిరిపమెత్తి పలుకూళ్ళు మెక్కిన పాండవులు; అంతకుతగ్గ గంతగా-అతుకుల బొంతగా-అయిదుగురూ ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు; స్నాతువసాలము చెంత శల్యము సంప్రాప్తించిన శునకములట్లు- మాపితృదేవ దయాలబ్ధప్రాప్త యింద్రప్రస్థ వైభవముతో, నేడు యాగకార్యదూర్వహులగుటయా?! హ్హహ్హహ్హహ్హ.. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట..ఆ ..హ్హహ్హహ్హ.. ఏమి కల్పనా చాతుర్యమూ..ఏమి కల్పనాచాతుర్యము! అయిననూ కుంతీ లోలున స్వర్గ,నరకాధిపతులిర్వురూ పాండురాజునకు తమ్ములే కదా! ఆయనెందున్ననూనూ జరుగనిదేమీ, లోపమేమి?! అయ్యారే! సకల రాజన్యలోకమూ సాహోయనునాదములు సలుప భారత భారతీ శుభాశీస్సులతో పరిపాలన సాగించెడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాగించ గోరెడి పాండవుల దుష్ప్రయత్నమా యిది?! రారాజుతో సాటిరాజు కావలెననెడి ధర్మజుని దుస్తంత్రమా యిది?! అయినచో, కుతంత్రముతో, కుత్సితపు బుధ్ధితొ పయనించిన యీ రాజసూయము సాగరాదూ, మేమేగరాదు.


శకు:- అని గట్టిగా అనరాదు.హు హు. వేరొకరు వినరాదు. నీవు పోనిచో, అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్థుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదని తిరిగి యీ గట్టివాదు. ఒకవేళ నీవు పోకపోయిననూ, యాగమా ఆగునదికాదు. పోయినచో, స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్నీ, బలగాన్నీ కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల, కురుసార్వభౌముడు మాననీయుడూ, మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో- ఆపైన కొంచెపు వంచన పనులన్నిటికీ, అయినవాణ్ణీ, అమ్మతమ్ముణ్ణీ నేనున్నానుగా!

దుర్యో:- హ్హహ్హహ్హహ్హ

శకు:- ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.

దుర్యో:- ఊ

శకు:- హు హు హు..కనుక, హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారంతో, చతురంగబల సమేతులై, శతసోదర సమన్వితులై, శ్రీ శ్రీ శ్రీ గాంధారీసుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయంచేయవల్సిందే! రాజసూయ యాగం సందర్శించవలసిందే!

దుర్యో:- హ్హహ్హ్హహ్హహ్హహ్హ




3. "కురువీరులకు ధర్మజుని స్వాగతం" :-

వందిమాగధులు:- సకల సురాసుర నికర భయంకర పరశుప్తిహిత పరశురామ నిజమదవిదరణోద్దండ ధనుఃపాండిత్య ప్రకటిత ధౌరేయా! గాంగేయా! జయీభవ! దిగ్విజయీభవ!

విశ్వవిశ్వంభరాభరణ సముద్దండ భుజాదండ మండిత గదాదండ ప్రహత రాజసముదాయా! కురువంశ భాగధేయా! జయీభవ! దిగ్విజయీభవ!

శతకోటి సూర్యప్రభా భాసిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీట హార మణీవలయా! వీరాధివీరా! వితరణాపరావతారా! జయీభవ! దిగ్విజయీభవ!

ధర్మ:- సోదరా భీమసేనా! కురుసార్వభౌములకు మయసభా భవనము విడిదిపట్టు గావించు.


మయసభలో సుయోధనుడు

దుర్యో:- అహో! అమ్లానభావ సంభావితమైన యీ దివ్య ప్రసూన మాలికా రాజమును కురుసింహుని గళసీమ నలంకరించిన వారెవ్వరు?! ఆఁ! హ్హహ్హహ్హహ్హ! అనిమిష యామినీ అతిథి సత్కార దివ్య సేవా ప్రభావము. ఔనా!ఔ! ఔ! ఆఁ! ఆఁ! హ్హహ్హహ్హహ్హ ఓహ్ ఆ ఏమా సుమధుర సుస్వరమూ?! కాకలీ కలకంఠకంఠ కుహుకుహూకార సుచిహిత దివ్య సుర కామినీ కామినీయక సుస్వాగతమౌనా?! ఆహహా!హ! సొబగు సొబగు...సొబగు సొబగు! ఔరా! ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా?! హ్హహ్హహ్హహ్హహ్హ. ఔ! ఔ!

-(పాట)-

(రాగం: సారంగి)

కురు సార్వహౌమా! ఓ కురు సార్వభౌమా!

రారా! ఇటు రారా! రసిక రాణ్మౌణీ

కసరి తేలించరా కుసుమ శర కేళి...II రారాII

ఆ చుక్కల దొరసాల జల్లులే ధిక్కరించు దివికాడా

చక్కెర వింటి జాబిలే వెక్కిరించు వగకాడా

వంటరి నీ మైతిరి మాయురే నీ మగసిరీ

వలపులే కనుల లలిత హాసములే మలచుకున్నవాడేరా..IIరారాII

ముత్యపు టద్దపు మిక్కిలి చెక్కిట నిలుపరా నెలవంకనూ

వంపుల సొంపుల జిలుగు మ్రోవి ముద్రించరా శశిరేఖనూ

యెలమి జాడ క్రొన్నడమతో కళల రసరించు క్రొన్నడమితో

నిను వరించి కలవరించి వేచిన ప్రణయవల్లరీరా

కురువరా దొరా ....IIరారాII


అయ్యారే! భ్రమ! ఇది నా భ్రమ! హ్హహ్హహ్హ్హహ్హ్హ... కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ! భళా సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు యీ కురుభూకాంతుని సంభావనా సంభాషణభూషణములచే యీ సభాభవనము ధన్యమూ, ధన్యము! హ్హహ్హ..అకుంఠిత నిర్మాణ చాతురీధురీణుడవగు ఓ మయబ్రహ్మా! నీ శిల్పచాతురీ మధురిమ ఆ బ్రహ్మకుగానీ, విశ్వబ్రహ్మకుగానీ లేదూ లేదూ లేదు. ఆఁ ! లేవచ్చునూ లేకపోవచ్చును. కానీ, పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులైన మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరా వినుత శాశ్వత మహైశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారి గర్భోద్భూత అనర్ఘ ముక్తామణీ వ్రాతంబులు మాకుండిన వుండవచ్చు. సాగరమేఖలా సతీ కరగ్రహణంబుప్రాప్తి సార్వభౌమత్వపదంబందిన అందవచ్చు. కానీ యిట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోటు. శతృకృతాపచారమున కంటె శతృవైభవము శక్తిమంతుల హృదయమునకు దావానల సదృశము. ఊఁ! ఇక నేనిందుండరాదు......ఏమీ! నిరాఘాట పథుడనగు నాకీ కవాట ఘట్టనమా! పరులెవ్వరూ లేరుకదా! మా భంగపాటును పరికించలేదు కదా! ఇస్సీ! యీ మయసభను మాకు విడిదిపట్టు గావించుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మవమానించుటకే! ఊఁ! ఆఁ ! ఏమీ! సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా! ఆఁ! అంతయూ మాయామోహితముగా వున్నదే! ఊఁ! హుహుహు...ఇదియునూ అట్టిదియే! ఆఁ! హ్హహ్హహ్హ! పాంచాలీ! పంచభర్తృకా!

భీమ:- హ్హహ్హ్హహ్హ్హహ్హ్హ... కురురాజా! యివిగో పొడి వస్త్రములు. ధరియింతువా!

దుర్యో:- వదరుబోతా! వాయునందనా!








4. "సుయోధన పరితాపం" :-


పాంచాలీ.. పంచభర్త్రుక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము ? ఎంత మరువ యత్నించినను మరపునకురాక- హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహోత్తమ- క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యధౌరేయుండనై ... నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు- శతసోదరులక గ్రజుండనై ... పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురుప్రాప్త- శస్త్రాస్త్రవిద్యాపారీణుండైన- రాధేయునకు మిత్రుండనై.. మానధనుడనై- మనుగడ సాగించు -నన్ను చూచి ఒక్క ఆడుది- పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా ? అహో ! తన పతులతో తుల్యుడనగు నన్ను భావగా సంభావింపక, -సమ్మానింపక.. గృహిణీధర్మ పరిత్యక్తయై.. లజ్జావిముక్తయై.. ఆ బంధకి -ఎట్టఎదుట యేల గేలి సేయవలె ? అవునులే.. ఆ బైసిమాలిన భామకు- ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున -మగలముందొక మగని- వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో -పచ్చిపచ్చి వైభవముల తేలించు- ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ? ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో- మోరెత్తి కూతలిడునా ! అని సరిపెట్టుకొందునా! ఆ ! ఈ లోకము మూయ మూకుడుండునా ! ఐనను -దుర్వ్యాజమున సాగించు- యాగమని తెలిసి తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో! నిజరత్నప్రభా సముపేతమై- సర్వర్త్రు సంశోభితమైన -ఆ మయసభాభవనము -మాకేల విడిది కావలె.. అయినది పో ! అందు చిత్రచిత్రిత- విచిత్ర లావణ్య లహరులలో- ఈదులాడు దిదృక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో ! సజీవ జలచర సంతానవితానంబులకాలవాలమగు- ఆ జలాశాయమున మేమల కాలు మోపవలె .. మోపితిమిపో ! సకల రాజన్యకోటీరకోటీ సంప్రక్షిప్త- రత్నప్రభా నీరాజితంబగు- మాపాదపద్మమేల అపభ్రంశమందవలె.. ఏతత్సమయమునకే- పరిచారికాపరీవృతయైన -ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ? ఆ విధి.. హా విధి.. హా హతవిధీ.. ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము- అవమాన బడబానల జ్వాలలు- ధగ్ధమొనర్చుచున్నవి మామా.. విముఖునిసుముఖునిజేసి -మమ్మటకు విజయము చేయించిన -నీ విజ్ఞాన విశేష విభావాధిక్యములు- ఏమైనవి మామా ? పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై -మర్యాదాతిక్రమణముగా మనుటయా… పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక -మరణించుటయా.. ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక- అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి- ఆపైన వేరొకటియా... ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?

దుశ్శా:- పాంచాలీ పరాభవము..మయసభా విధ్వంసము..పాండవ వినాశము

కర్ణ:- మహాదాతా! ఈ అవమానం మీదికాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాతా ఆనతీయండి.

దుర్యో:- హితుడా!

కర్ణ:- ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందుంచుతాను. విచక్షణాజ్ఞానహీన, మానహీన, ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతుకీడ్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని ఛటఛ్ఛటలలో ఆ యింద్రప్రస్థ పురాన్ని భస్మీపటలం చేస్తాను.

శకు:- కానీ...దాని వలన మనకొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా? పరాభవావమానములు సమసి పోవునా? హ్హహ్హహ్హ... లేదు...నీ వూహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణమూ, అమర లోక నివాసమూ యీ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోసము ప్రతి నిముసమూ తలచి తలచి, తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి,

కృశించి కృశించి నశించవలె! లేదా, నీకాజన్మాంతమూ దాసానదాసులై నడపీన్గులవలె మనుగడ సాగించవలె!.వాడు పేరుకు ధర్మరాజేకాని, పెను వేపవిత్తు, జూదరి, వ్యసనపరుడు! ఆమిషతోనే వానిని హస్తినకు రావించి, పాచికలాడించి, ఓడించి, సర్వమూ హరించి, నీ నిండు కొలువునకా కుమతి పాంచాలిని యీడ్పించి, వలువలూడ్పించి, వివస్త్రనుగావించి, విగత మానవతిగా నిల్పి- నీవు, నీ శతసోదరులు, నీ యశోరక్షకుడైన యీ రాధేయుడు, తక్కుంగల నీ స్వజన బంధు మిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలిచేసి గొల్లున నవ్వ- పాండవుల పంచప్రాణములూ విల విల విల పోవ- అయ్యారే! నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారమిదా! ఆఁ! హురే! హురే! యని సమస్త లోకమూ హర్షధ్వానములు సలుప, నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడునటుల పగ తీర్చనిచో హుహుహు నేను నీ మేనమామ శకునినే కాదు! నీ తల్లి గాంధారీదేవి తోడపుట్టిన వాడనే కాదు!

దుర్యో:- హ్హహ్హహ్హహ్హహ్హ......పాంచాలీ....పంచభర్తృకా!





Unknown at 08:38

Share

14 comments:


Unknown25 May 2020 at 08:56

Super Chala bagundhi, Inka migilina dialouges kuda post cheyandi


Reply


Unknown6 July 2020 at 02:05

Exlent


Reply


Unknown20 July 2020 at 08:19

Super


Reply


Navya Vinni4 September 2020 at 06:12

Annagari dailogues amogam, amrutham.😍😍 ayanaku ayane sati😍😍 Jai NTR ❤


Reply


Navya Vinni4 September 2020 at 06:13

Anna gari dailogues amogam 😍 ayaniki ayane sati😍😍😍 Jai NTR


Reply


Unknown15 September 2020 at 00:08

Superb sir


Reply


Unknown2 November 2020 at 21:10

NTR gari dialogues anni amogham


Reply


Raj14 November 2020 at 06:21

i thank you for giving this dialogues clearly in telugu script and it's an awesome dialogues in NTR Garu career Jai NTR Jai Jai NTR for his super voice note and delivered dialogues in time And his memory power is so good to express dialogues in front of camera in action he is ultimate and all time Hero by attracting so many different kinds of audiences and He is moral and role model to Film industry .Thank you so much.

Mr. Raj


Reply


Unknown7 January 2021 at 04:12

మహోన్నతంగా ఉంది,చాలా ధన్యవాదాలండి.


Reply


Unknown2 July 2021 at 23:43

anna gari dialogues adhurs


Reply


Unknown30 September 2021 at 09:02

Vammo ఎవడి వల్ల kaadhu


Reply


PRATHAP KUMAR22 November 2022 at 16:48

Super sir..., chala spastanga E dialogues rasaru. Neneu enno sarlu ee dialogues vintu rasevanni. Konni konni padhalu vini rayataniki spastanga vinbadeviga vundevi kavu. Meru chaala spastanga thappulu lekunda rasaru.thank you so much.

Sr.NTR garu aithe aayaana natana gurchi entha cheppina thakkuve...YUGAPURUSHUDU.Telugu jati unanntha varaku.🙏🙏🙏


Reply


PRATHAP KUMAR22 November 2022 at 16:54

Rayabhara sannivesam lyrics kuda rayagalaru. Dhanyavadhamulu🙏🙏🙏.


Reply


raj4 June 2023 at 01:02

Please post padhyalu


Reply


Home

View web version

About Me

Unknown

View my complete profile

Powered by Blogger.

No comments:

Post a Comment